K.S.Ramarao about Malli malli Idi Rani Roju

మరపురాని విజయం! – క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
ఔను,
ఈరోజు నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా వుంది. గత 40 ఏళ్ళుగా నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలు అందుకున్నప్పటికీ ఈరోజున ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సాధించిన అద్భుత విజయం నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది.
ఎందుకంటే..
మంచి సినిమాల కోసం, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే మంచి సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిరుచిగల ప్రేక్షకుల కోసం నిర్మించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి చాలా కాలానికి మంచి సినిమా చూసామన్న అభినందనను అందించడం నాకెంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది. పవిత్రమైన ప్రేమ ఎప్పటికైనా ఫలిస్తుందన్న పాజిటివ్‌ అంశంతో నిర్మించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాన్ని యూత్‌ అంతా మళ్ళీ మళ్ళీ చూడడం వలనే ఇది ఇంత పెద్ద హిట్‌ అయింది. మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ నుండి ఓ మంచి కథాంశంతో మళ్ళీ ఓ సూపర్‌ డూపర్‌ హిట్‌ రావాలని కోరుకున్న మా మిత్రులు, శ్రేయోభిలాషుల శుభాశీస్సులతో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సెన్సేషనల్‌ హిట్‌ అయింది. మా సంస్థ మీద ఎంతో అభిమానంతో మాకు మంచి విజయం రావాలని కోరుకున్న వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి సినిమా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేస్తారన్న నా నమ్మకాన్ని ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ మళ్ళీ ఇంకోసారి నిరూపించింది. ఈ విజయం మరిన్ని మంచి చిత్రాల్ని, గొప్ప చిత్రాల్ని నిర్మించడానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సాధించిన విజయం మాది కాదు, మీది. ఉత్తమాభిరుచిగల ప్రేక్షకులందరిదీ.
ఈరోజు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సాధించిన సంచలన విజయం వెనుక ఎంతోమంది వ్యక్తుల కృషి వుంది. ప్రేమ యొక్క పవిత్రతను మనసుకు హత్తుకునేలా రూపొందించిన మా దర్శకుడు క్రాంతిమాధవ్‌, కథలోని హీరోహీరోయిన్‌ పాత్రలకు తమ అద్భుత నటనతో ప్రాణ ప్రతిష్ట చేసిన శర్వానంద్‌, నిత్యామీనన్‌, మన విశాఖపట్నం అందాల్ని ఎంతో అందంగా తెరపైకి ఎక్కించి సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా ఫోటోగ్రఫీ చేసిన జ్ఞానశేఖర్‌, చాలాకాలం తర్వాత మళ్ళీ మధురమైన సంగీతాన్ని విన్నామన్న అనుభూతిని కలిగించిన సంగీత దర్శకుడు గోపిసుందర్‌, ద్వందార్థాలకు తావు లేకుండా చక్కని డైలాగ్స్‌ రాసిన సాయిమాధవ్‌ బుర్రా, ఈ లవ్‌స్టోరీని అద్భుతంగా ఎడిట్‌ చేసిన సీనియర్‌ మోస్ట్‌ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు, అందమైన ప్రేమకథను మరింత అందంగా చూపించిన కళాదర్శకుడు సాహి సురేష్‌ ఇంకా ఎందరెందరో అహర్నిశలు చేసిన కృషికి ఫలితమే ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రం సాధించిన గొప్ప విజయం.
ఈ మంచి సినిమాలోని మంచిని ప్రేక్షకులందరికీ తెలియజెప్పి కమర్షియల్‌గా ఈ చిత్రం ఘనవిజయానికి దోహదపడిన మీడియాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రానికి అన్నివిధాలా తన తోడ్పాటుని అందించిన మా మిత్రులు రఘురామరాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అభిలాష, ఛాలెంజ్‌, రాక్షసుడు, చంటి, మాతృదేవోభవ, స్వర్ణకమలం, పుణ్యస్త్రీ, ముత్యమంతముద్దు చిత్రాల నుండి బుజ్జిగాడు, దమ్ము వరకు మా సంస్థ నుండి వచ్చిన చిత్రాల్ని ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకులు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’కు అందించిన విజయం అద్భుతం, అపూర్వం. మళ్ళీ నిర్మాతగా ఎన్ని విజయాలు అందుకున్నా కూడా ఈ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’కు లభించిన ఘనవిజయం నా జీవితంలో ఎప్పటికీ మరపురానిది. ఇలాంటి అపూర్వమైన అనుభూతిని నాకు అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
మీ
కె.ఎస్‌.రామారావు